హైదరాబాద్: రిజర్వేషన్ల జోలికి వస్తే దేశం రావణ కాష్టం అవుతుందని హెచ్చరించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన దేశంలో ఇప్పటకీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. 

అసమానతల వల్లే రిజర్వేషన్లను కొనసాగించాలని సూచించారు. బీజేపీ ఇష్టం వచ్చినట్లు ప్రతీ అంశంలో వేలు పెడదామని ప్రయత్నిస్తే ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. బీజేపీ అంటేనే వ్యాపారస్థుల పార్టీ అని విమర్శించారు. 

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం జరిగిన ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ శిక్షా సంస్కృతి ఉత్తాన్ నిర్వహించిన జ్ఞాన్ ఉత్సవ్ కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై చర్చలు జరిగిన ప్రతిసారి ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. 

అలాకాకుండా అన్ని వర్గాలవారూ సుహృద్భావ రీతిలో అభిప్రాయాలు పంచుకోవాలని  సూచించారు. రిజర్వేషన్ల అనుకూలురు, వ్యతిరేకులు ఎదుటి పక్షం ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని వాదనలు వినిపించాలని  మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.