రీంనగర్: టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. అబద్దాలు చెప్పడంలో మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ చీఫ్ ను మించిపోయారని ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లాలో ఎన్నికలప్రచారంలో భాగంగా ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో మార్నింగ్ వాక్ చేశారు. సరదాగా కాసేపు కార్యకర్తలు స్నేహితులతో ముచ్చటిస్తూ ఎక్సర్సైజ్ చేశారు.
 
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేటీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే అబద్దాలు చెప్పి ఓట్లు దండుకుందామని ప్రయత్నిస్తున్నాడని దుయ్యబుట్టారు. రెండేళ్లలో సిరిసిల్లకు రైలు తెస్తానని అబద్దాలు చెప్తున్నాడని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో తెలేని రైలు మరో రెండేళ్లలో తెస్తాడా అని నిలదీశారు. నాలుగున్నరేళ్లుగా సిరిసిల్లలో చేనేత కార్మికులను పట్టించుకోని కేటీఆర్ ప్రపంచానికే తలమాణికంలా వస్త్రపరిశ్రమను సిరిసిల్లకు తీసుకువస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

మాజీప్రధాని పీవీ నరసింహారావు హయాంలో పెద్దపల్లి నుంచి నిజామాబాద్ కు రైలు తీసుకురావడానికి 15 ఏళ్లు పట్టిందన్నారు. రైల్వే అంశంలో ఆలోచన కుందేళ్లులా నడిచినా అమలు మాత్రం తాబేలులా ఉంటుందన్నారు.  
 
కేసీఆర్ నిరంకుశ పాలనను కూల్చేందుకే మహాకూటమిని ఏర్పాటు చేశామని పొన్నం చెప్పుకొచ్చారు. కేసీఆర్ అబద్దపు హామీలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.