కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ ఉత్సాహంతో తెలంగాణలో కూడా దూకుడు పెంచింది. ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో చేరికల జోష్ కనిపిస్తోంది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ ఉత్సాహంతో తెలంగాణలో కూడా దూకుడు పెంచింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు రెడీ అయింది. పలువురు నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి‌లతో పాటు పలువురు నేతలు హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. 

వీరంతా ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం జరగనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డిలు వారి ముఖ్య అనుచురలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ గాంధీతో భేటీ తర్వాత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో కూడా వీరు సమావేశం అయ్యే అవకాశం ఉంది. 

మరోవైపు టీ కాంగ్రెస్‌లో చేరికల నేపథ్యంలో.. రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు ఢిల్లీకి రావాలని ఏఐసీసీ నుంచి పిలుపువచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్‌, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి‌లతో పాటు దాదాపు 25 మందికి ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించింది. వీరిలో ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా.. మరికొందరు నేతలు ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీకి మారింది. 

ఇక, కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటిలు.. హస్తం పార్టీలో చేరికకు సంబంధించి ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ తర్వాత.. ఖమ్మం, మహబూబ్‌ నగర్‌లో సభలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపైనా స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా సమాచారం. మరోవైపు నాగర్‌‌కర్నూలులో సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని జూపల్లి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సభలకు రాహుల్ గాంధీ హాజరవుతారా? లేదా టీ కాంగ్రెస్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రియాంక గాంధీ హాజరవుతారా? అనేది కూడా.. జూపల్లి, పొంగులేటి ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.