మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు ఈ నెల 25న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వీరు హస్తం కండువా కప్పుకోనున్నారు. రేపు దీనిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్లనున్నారు. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
కాగా.. పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఖమ్మం, మహబూబ్ నగర్‌లలో బహిరంగ సభలు నిర్వహించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సభల్లోనే నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా సమాచారం. ఇక, ఇప్పటికే జూపల్లి కృష్ణారావు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కాంగ్రెస్ నేత సంపత్.. జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేకంగా సమావేశమై ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
Also Read: కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి.. రేపు ఢిల్లీకి వెళ్లనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఇక, రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూమ్ కాల్ ద్వారా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. జూమ్ మీటింగ్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ జూమ్ సమావేశం తర్వాత పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత వచ్చిందనే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ గూటికి పొంగులేటిని తీసుకురావడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా కీలక భూమిక పోషించారనే ప్రచారం సాగుతుంది.
