పద్నాలుగు నెలల క్రితం అదృశ్యమైన వివాహిత కేసును ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు చేధించారు. నారాయణ్ పేట్ జిల్లా నర్వ మండలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

మక్తల్ మండలంలోని గుడిగండ్లకు చెందిన యువతిని నర్వ మండలం నాగిరెడ్డి పల్లికి చెందిన వ్యక్తికిచ్చి గతేడాది సెప్పెంబర్ లో పెళ్లి చేశారు. పెళ్లయిన కొన్ని రోజులకే వివాహిత కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి ఠాణాలో ఫిర్యాదు చేశారు. 

అయితే ఈ కేసులో వివాహిత తల్లిగారి ఊరైన గుడిగండ్లకు చెందిన డ్రైవర్ బాలయ్యను అనుమానితుడిగా చేర్చారు. గతేడాది నవంబరులో దిశ సంఘటన జరగడంతో బాలయ్య సిమ్ కార్డును థ్వంసం చేశాడు. దీంతో వారి జాడ కనిపెట్టడం కష్టమైంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఆయన కుటుం సభ్యులతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడని తెలుసుకుని ఫోన్ నంబర్లను సేకరించి ట్రాకింగ్ లో పెట్టారు. కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు. 

నిందితుడు బాలయ్య డ్రైవరు కావడంతో వివిధ రాష్ట్రాలకు తిరుగుతుంటాడు. 14 నెలలుగా ఆయన ఒకచోట ఉండకపోవడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. ఈనెల 3న హైదరాబాద్ లో ఓ ప్రాంతంలోని టవర్ ఆధారంగా బాలయ్య ఆచూకీ దొరకడంతో పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. 

అక్కణ్ణుంచి బాలయ్య, వివాహిత కాపురం పెట్టిన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి వెళ్లి వారు అద్దెకుంటున్న గదిలో వివాహితను గుర్తించారు. ప్రస్తుతం ఆమెకు ఓ బాబు ఉన్నాడు. పోలీసులు వారిని నర్వకు తీసుకొచ్చారు. గురువారం కుటుంబీలకు అప్పగించారు. ఎస్సై వెంట కానిస్టేబుల్ రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.