అది హత్యే.. కిరాయి హంతకులతో సొంత బామ్మర్దిని చంపించిన బావ, మిస్టరీ ఛేదించిన పోలీసులు
కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలోని కాకతీయ కాలువ వద్ద దొరికిన మృతదేహం ఎవరిదో, దాని వెనుక కథేంటో మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఆస్తి కోసం సొంత బామ్మర్దిని బావే హత్య చేయించినట్లు తేల్చారు పోలీసులు.
కరీంనగర్ జిల్లా (karimnagar district) మాన కొండూరు (manakondur) సమీపంలోని కాకతీయ కాలువ (kakatiya canal) దగ్గర జూన్ 2న జరిగిన హత్య కేసు (Murder case)ను పోలీసులు ఛేదించారు. తిమ్మాపూర్‌కు చెందిన కొమ్ము రవి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. అయితే రవి మృతిపై అనుమానం ఉందంటూ మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. గోదావరి ఖని కార్పోరేటర్ భర్తనే సూత్రదారిగా గుర్తించారు.
హత్య కోసం గోదావరిఖనికి చెందిన ముఠాకు రూ. 3 లక్షల సుపారి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోటి రూపాయల విలువచేసే భూ వివాదమే హత్యకు కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొంత బావమరిదినే ఆస్తి కోసం హత్య చేయించి ప్రమాదంగా చిత్రీకరించారు. పూడ్చిన శవాన్ని బయటకు తీయించి పోలీసులు పోస్టుమార్టం చేయించారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మృతుడు ఇటీవల తన వ్యవసాయ భూమి విక్రయించడంతో 3 కోట్లు వచ్చాయి. అందులో వాటా కోసమే బావమరిదిని హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.