పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు దంపతులు హత్యకు గురైన ప్రదేశంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ హత్యలను తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకొన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు మరో ముగ్గురు అరెస్టయ్యారు.

ఈ హత్యలపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రంలోని కోర్టుల్లో విధులను బహిష్కరించిన విషయం తెలిసిందే.రామగిరి మండలం కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామన్ రావు దంపతులను ఈ నెల 17వ తేదీన  ప్రత్యర్ధులు రోడ్డుపైనే హత్య చేశారు.

ఈ హత్య ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకోవడంతో పాటు ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.హత్య జరిగిన ప్రాంతంలో సాక్ష్యాలను భద్రపర్చడంలో పోలీసులు వైఫల్యం చెందారని  మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. 

దీంతో ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. ఇతరులు ఎవరూ కూడ ఘటన స్థలంలోకి ప్రవేశించకుండా కంచెను ఏర్పాటు చేశారు. వామన్ రావు  కారుపై రక్త నమూనాలతో పాటు ఇతర ఆధారాలను సేకరించడం కోసం పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. కోర్టు నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఘటన స్థలంలో పోలీసుల భద్రతను ఏర్పాటు కొనసాగించనున్నారు.