ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరెలతో  వెళ్తున్న లారీని  ఆదివారం నాడు పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంకు బతుకమ్మ చీరెలను  లారీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు.

లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు  విచారిస్తున్నారు. చౌటుప్పల్ నుండి కొత్త‌గూడెనికి  లారీని తరలిస్తున్నట్టు పోలీసులకు  లారీ డ్రైవర్ చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున  బతుకమ్మ చీరెల పంపిణీని ఎన్నికల కమిషన్ నిలిపివేసింది.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార టీఆర్ఎస్  బతుకమ్మ చీరెలను పంపిణీకి అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని  విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  బతుకమ్మ చీరెలతో వెళ్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకొన్న విషయాన్ని తెలుసుకొన్న విపక్షపార్టీలకు చెందిన  నేతలు ఆందోళన నిర్వహించారు. 

బతుకమ్మ చీరెలను ఎవరు తరలిస్తున్నారనే విషయమై  సమగ్రంగా విచారించి నిందితులను అరెస్ట్ చేయాలని విపక్షాలు  పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి.