అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు, పలువురు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు, పలువురు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత మూడు రోజులుగా నరేష్ పరారీలో ఉన్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కొడంగల్ పోలీసు స్టేషన్‌లో నరేష్‌పై కేసు నమోదైన తర్వాత.. అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలోనే నరేష్‌ను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నరేష్ ఆచూకీ కోసం పోలీసులు హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్‌లో గాలింపు కొనసాగిస్తున్నారు. 

ఇక, మరికొన్ని చోట్ల కూడా నరేష్‌పై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే నరేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. బైరి నరేష్ యూట్యూబ్ చానల్‌ను నిషేధించాలని కోరుతున్నారు. 

ఇదిలా ఉంటే.. బైరి నరేష్ అనే నాస్తికుడు అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. డిసెంబరు 19న వికారాబాద్ జిల్లా రావులపల్లిలో జరిగిన సభలో అయ్యప్ప స్వామిపై నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు. మరికొన్ని చోట్ల కూడా అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు. మతపరమైన మనోభావాలను టార్గెట్ చేయడం, అవహేళన చేయడం, దెబ్బతీయడం అనే ఉద్దేశ్యంతో హిందూ దేవుళ్లను టార్గెట్ చేయడం అందరికీ ఫ్యాషన్‌గా మారిందని అన్నారు.

అయ్యప్ప భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు నరేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే నరేష్ ఇంకా పరారీలో ఉన్నాడని, తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.