Asianet News TeluguAsianet News Telugu

మూడు రోజుల తరువాత వీడిన మర్డర్ మిస్టరీ.. భార్యే చంపి, వేపచెట్టుకు ఉరివేసి.. ఆ తరువాత...

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అంతమొందించింది ఓ భార్య. ఆ తరువాత పాలోళ్లు చంపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

police revealed man murder mystery, wife culprit in medak
Author
First Published Nov 23, 2022, 10:22 AM IST

మెదక్ : మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. . దీనికి సంబంధించిన కేసు మిస్టరీ వీడింది. అహర్నిశలూ శ్రమించిన పోలీసులు మిస్టరీని మూడు రోజులలోనే ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను.. మంగళవారం తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదార్, ఎస్ ఐ శివప్రసాద్ రెడ్డి తో కలిసి కౌడిపల్లి పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించారు. 

మృతుడు కౌడిపల్లి మండలం పీర్ల తండా పంచాయతీ కొయ్యగుండ తండాకు చెందిన కాట్రోత్ శ్రీను (28). ఇతనికి భార్య దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఈనెల 18న రాత్రి శ్రీను పొలానికి వెళుతున్నానని భార్యకు చెప్పాడు. అలా వెళ్ళిన అతను ఉదయం శవమై కనిపించాడు. ఈ మేరకు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు విచారణ చేపట్టారు.

భార్యమీదే అనుమానం.. 
అయితే, మృతుడి భార్య దేవి ప్రవర్తన తేడాగా ఉంది. ఆమె తండాలో పలువురితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య పలుమార్లు  గొడవ జరుగుతుండేది.దీంతో విసిగిపోయిన దేవి.. తన సరదాలకు అడ్డుగా ఉన్న భర్తను చంపాలని నిర్ణయించుకుంది. దీనికోసం తండాకు చెందిన రాణి అలియాస్ నవీన అనే తనస్నేహితురాలుతో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఈ హత్య చేయడానికి కొడుకు వరసయ్యే పవన్ కుమార్ సాయం కూడా తీసుకుంది. భర్తను హత్య చేయడానికి సహాయం చేస్తే.. తనకు వచ్చే రైతు బీమా డబ్బుల్లో.. రూ.50 వేలు ఇస్తానని పవన్ కు ఆశ పెట్టింది. 

నా కొడుకును చూడనివ్వడం లేదు: సూరారం ఆసుపత్రి వద్ద మంత్రి మల్లారెడ్డి బైఠాయింపు

ఈ క్రమంలో.. ఈనెల 18వ తేదీ ఉదయం దేవి, శీనుకు తమ ఇంటి దగ్గరున్న జామ చెట్టు విషయంలో.. తమ పాలోళ్లైన కాట్రోత్ ధన్ సింగ్, అతడి ఇద్దరు కొడుకులు సంతోష్, తులసీరామ్ తో గొడవ అయ్యింది. భర్తను అడ్డు తొలగించుకోవడానికి  దేవి ఇదే అదనుగా భావించింది. అందుకే అదే రోజు రాత్రి పవన్ కుమార్ కు మద్యం కొనిచ్చి.. భర్త శ్రీనుకు తాగించాలని చెప్పింది. దీంతో పవన్, శ్రీనూ ఇద్దరూ కలిసి పొలం లో మద్యం తాగారు. ఆ తరువాత రాత్రి దేవి అక్కడికి చేరుకుంది. మద్యం మత్తులో ఉన్న శ్రీనును పవన్ సహాయంతో వేప చెట్టుకు ఉరివేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని ఈడ్చుకు వెళ్లి ఇద్దరూ కలిసి పొలంలో పడేశారు. 

భర్త చనిపోవడానికి.. తమతో గొడవ పడిన పాలోళ్లే కారణం అని, వారే తన భర్తను చంపేశారని దేవి ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అయితే పోలీసులకు దేవి ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. దీంతో విచారణలో భాగంగా మృతుడి కాల్ డేటా చెక్ చేశారు. దాని ఆధారంగా దర్యాప్త చేపట్టారు. దీంట్లో తన అక్రమ సంబంధాలకు శ్రీను అడ్డుగా ఉన్నాడని భార్య పథకం ప్రకారం చంపిందని తేలింది. ఇక ఆమెకు సహకరించిన పవన్, రాణీలు.. శ్రీనును చంపేస్తే రైతు బీమా, ఎల్ఐసీ డబ్బులు వస్తాయన్న ఆశతో హత్యకు సహకరించినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు శాంతి, శోభారాణి, భాగయ్య, శ్రీనివాసులు, పోచయ్యను డీఎస్పీ అభినందించారు. వీరికి నగదు రివార్డ్ అందజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios