రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు స్పందించారు.
రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పోలీసుల తీరును ఖండించారు. అయితే వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో పోలీసులు స్పందించారు. అరెస్ట్ అయిన వారిలో రైతులు లేరని స్పష్టం చేశారు. వీరు నలుగురు జమ్మాపూర్‌లోని ఓ కంపెనీలో కార్మికులని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వీరు 20 గుంటల భూమిని కొనుగోలు చేశారని పోలీసులు వెల్లడించారు. గతంలో వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు తమపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారని.. అలాగే కలెక్టరేట్‌లోకి వెళ్లి నిప్పు పెట్టారని చెప్పారు. వాళ్ల ప్రవర్తన సరిగా లేకనే చేతులకు బేడీలు వేసి కోర్ట్‌కు తీసుకొచ్చామని పోలీసులు స్పష్టం చేశారు.
కాగా.. మే 30న భువనగిరి కలెక్టరేట్ ఎదుట రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు ఆందోళన నిర్వహించారు. దీంతో వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు అదే రోజు రిమాండ్‌కు తరలించారు. అయితే విచారణ సందర్భంగా వారి చేతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టులో హాజరుపరచడం కలకలం రేపింది.
దీనిపై స్థానిక ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ కోసం భూసేకరణ పేరుతో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. దీనిపై శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. రైతుల చేతికి బేడీలు వేయడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
