కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాకతీయ కాలువలో  పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక కుటుంబం జల సమాధి కావడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో శాస్త్రీయమైన ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఈ ఏడాది జనవరి 26వ తేదీన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధిక  ఆమె భర్త సత్యనారాయణరెడ్డి కూతురు కాకతీయ కాలువలో పడి మృతి చెందారు. టూరుకు వెళ్తూ కారుతో సహా ఈ ముగ్గురు మృతి చెందడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. 

ఈ ఏడాది జనవరి 26వ తేదీన సత్యనారాయణ రెడ్డి ఒక్కడే తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద రాజీవ్ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో కారు దృశ్యాలు రికార్డయ్యాయి. తిరిగి అదే రోజు రాత్రి 8:15 గంటలకు కరీంనగర్ కు వచ్చాడని టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  

ఈ విషయమై సీసీటీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మరో వైపు కారు కండిషన్ గురించి కూడ పోలీసులు  రవాణా శాఖాధికారులను సంప్రదించారు. కారు ఫిట్‌‌నెస్ విషయమై నివేదిక ఇవ్వాలని కోరారు. 

వాహనానికి సంబంధించి ఏదైనా తప్పిదంతో కారు కాలువలో పడిందా అనే విషయమై  పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో సత్యనారాయణరెడ్డి పలు ప్రాంతాల్లో తిరిగినట్టుగా జనవరి 27 వ తేదీ సీసీ పుటేజీని పోలీసులు గుర్తించారు.  కరీంనగర్ బ్యాంకు కాలనీలోని ఇంటి నుండి అలుగునూరు కాకతీయ కాలువ వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

జనవరి  27 తేదీ సాయంత్రం వరకు మాత్రం కారు అటువైపు రాలేదని సీసీ కెమెరా దృశ్యాల ప్రకారంగా పోలీసులు గుర్తించారు.  అయితే కారు ఏ సమయంలో కాకతీయ కెనాల్‌ వైపుకు వచ్చిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 సత్యనారాయణ రెడ్డి, రాధిక, వినయశ్రీల కాల్‌డేటాలను కూడ పోలీసులు పరిశీలించనున్నారు. కాల్‌డేటా ఇవ్వాలని టెలికం కంపెనీలను పోలీసులు కోరారు.  బుధవారం నాడు ఈ ముగ్గురి కాల్డేటా పోలీసులకు అందే అవకాశం ఉంది. కాల్‌డేటా అందితే ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.