సంగారెడ్డి: మూడు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అదృశ్యమైన వారం రోజుల పసికందు ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉందని పోలీసులు ప్రకటించారు.

సంగారెడ్డిలో మూడు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రిలో వారం రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

తమ పాప కోసం వారంతా ఆసుపత్రి వద్దే ఆందోళన చేస్తున్నారు. అయితే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో పోలీసులు గుర్తించారు.ఎల్లారెడ్డి శివారులోని శివనగర్‌కు చెందిన బంగారి సంతోష్, శోభ‌ దంపతులు సంగారెడ్డి  ప్రభుత్వాసుపత్రి నుండి  తీసుకెళ్లారు. ఈ దంపతులకు  నీలోఫర్ ఆసుపత్రిలో పాప పుట్టి చనిపోయింది. మూడు రోజుల క్రితం ఈ దంపతులు సంగారెడ్డి ఆసుపత్రిలో చిన్నారిని ఎవరైనా దత్తత ఇస్తారా అనే విషయమై ఆరా తీశారు.ఈ దిశగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తే అసలు ఈ విషయం వెలుగు చూసినట్టుగా పోలీసులు తెలిపారు.

సంగారెడ్డి ఆసుపత్రికి ఈ దంపతులు వచ్చిన సమయంలో ఉపయోగించిన బైక్‌ను పోలీసులు గుర్తించారు. ఈ బైక్ ఎల్లారెడ్డికి చెందిన వారిదిగా గుర్తించారు. ఎల్లారెడ్డిలో బంగారి సంతోష్, శోభ దంపతుల వద్ద ఉన్న చిన్నారిని సంగారెడ్డికి తీసుకొచ్చారు.  ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.చిన్నారిని కిడ్నాప్ చేసిన ఈ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 7వ తేదీన సంగారెడ్డిలోని మాతా-శిశు ఆరోగ్య కేంద్ర ఆసుపత్రిలో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.తల్లిని గుర్తించకుండా నిర్లక్ష్యం వహించిన స్టాఫ్ నర్స్, ఆయాలను  కలెక్టర్  హనుమంతరావు సస్పెండ్ చేశారు.