పాకిస్తాన్ నుంచి విజిటింగ్ వీసా పేరుతో ఇండియాకి వచ్చిన ఓ వ్యక్తి మాయ మాటలు చెప్పి... హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. తీరా... అతను పాకిస్తానీ అని  పెళ్లి తర్వాత తెలుసుకుంది ఆ యువతి. అయినప్పటికీ... సంవత్సరాలపాటు అతనిని భరిస్తూ వస్తోంది. ఆమెను అడ్డుపెట్టుకొని అతను ఇండియన్ గా చలామణి అయ్యేలా పలు రకాల గుర్తింపు కార్డులను పొందాడు. చివరకు అతని వేధింపులు తీవ్రతరం కావడంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాగా... అతను నిజంగా పాకిస్తానీనే అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...చాదర్‌ఘాట్‌లో నివసించే గాయని దేశ విదేశాల్లో జరిగే సంగీత కచేరీలలో పాటలు పాడేది. ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు మహ్మద్‌ ఇక్రమ్‌ పరిచయమై తాను దిల్లీలో ఉంటున్న ముస్లింనని, పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. ఆమె అంగీకరించడంతో హైదరాబాద్‌ వచ్చి వివాహం చేసుకున్నాడు. దిల్లీకి వెళ్దాయని యువతి చెప్పగా.. తాను పాకిస్థాన్‌ వాసినని, సందర్శకుల వీసాతో వచ్చానని అసలు విషయం బయటపెట్టాడు. 

ఆమె ఆగ్రహించడంతో ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఎవరికీ ఈ విషయాన్ని వెల్లడించలేదు. చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తూ చాదర్‌ఘాట్‌లోనే ఎనిమిదేళ్లు ఇక్రమ్‌ ఉండిపోయాడు. భార్య తరపు బంధువు నిజాంఖాజా ద్వారా ఆధార్‌ కార్డు పొందాడు. ఇక్రమ్‌ కోరిక మేరకు వరంగల్‌లో ఉంటున్న తన స్నేహితుడి ద్వారా పది, ఇంటర్‌ నకిలీ ధ్రువపత్రాలనూ నిజాం ఇప్పించాడు. 

అనంతరం ముంబయిలోని రాష్ట్రీయ విద్యాపీఠ్‌ పేరుతో నకిలీ విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తున్న రమేష్‌ మూలే ద్వారా హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఇక్రమ్‌ డిగ్రీ పట్టా కొనుక్కున్నాడు. వాటితో ఆరేళ్ల క్రితం భారత పాస్‌పోర్టు పొందాడు. గతయేడాది జూన్‌లో తనను తీవ్రంగా వేధించడంతో పాటు కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఇక్రమ్‌పై భార్య సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు పాకిస్థాన్‌ దేశస్థుడని, తనను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడని అదే సందర్భంలో వెల్లడించింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరా తీయగా... తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు మొత్తం వెలుగులోకి వచ్చింది. అతను నిజంగా పాకిస్తాన్ కి చెందినవాడేనని గుర్తించారు. అతను కొంతకాలం సింగపూర్ లో కూడా ఉద్యోగం చేసినట్లు గుర్తించారు. అయితే అతను నిజంగా బతుకు దెరువు కోసమే వచ్చాడా.. ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టడానికి వచ్చాడా అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.