హైదరాబాద్: హైద్రాబాద్‌కు సమీపంలోని నాగారంలో వృద్ధాశ్రమం పేరుతో నిర్భంధించి చిత్రహింసలు పెడుతున్నారని ఆశ్రమంలో ఉంటున్న బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం నాడు ఉదయం నాగారంలోని వృద్ధాశ్రమాన్ని తనిఖీలు చేశారు.

హైద్రాబాద్‌ నాగారంలో మమత ఓల్డ్ ఏజ్ హోం‌ కోసం మీ సేవ సెంటర్‌లో ధరఖాస్తు చేసుకొన్నారని అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.

ఈ ఆశ్రమంలో సుమారు 72 మంది ఉంటున్నారు. మానసికస్థితి లేని వారిని వృద్ధులను ఈ ఆశ్రమంలో ఉంచారు. ఒక్క రూమ్‌లో ఐదుగురు ఉండాల్సిన చోట 50 మందిని ఉంచారు.   బరువు తగ్గేందుకు వచ్చిన ఇద్దరు  కూడ ఈ ఆశ్రమంలోనే చిక్కుకుపోయారు.

 మానసిక పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పి కొందరు మానసిక స్థితి సరిగా లేని వాళ్లను కూడ ఈ ఆశ్రమంలో చేర్పించారు. బాధిత కుటుంబాల నుండి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు.

వృద్ధులను, మహిళలను ఆశ్రమం నుండి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  అందరూ ఉండీ కూడ ఆశ్రమంలో చేర్పించినవారిపై కూడ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 

 ఈ ఆశ్రమంలో ఇప్పటికీ 21 మంది మహిళలు, 53 మంది పురుషులు ఉన్నారు. కనీస సౌకర్యాలు కూడ లేవని అధికారులు గుర్తించారు. ఒకే వాష్ రూమ్‌ ఉన్న విషయాన్ని  పోలీసులు గుర్తించారు.  పురుషుల్లో ఎక్కువ మంది మానసిక స్థితి సరిగా లేనివారేనని వైద్యులు గుర్తించారు.  

ఈ ఆశ్రమంలో ఉన్నవారిపై నిర్వాహకులు కనీసం మంచినీళ్లు, సరైన ఆహరం కూడ అందించని స్థితి నెలకొంది. అంతేకాదు భోజనం, టిఫిన్ లాంటివి అడిగితే వారిపై దాడులకు దిగేవారు.  మూడు రోజుల క్రితం నిర్వాహకులు  ఆశ్రమంలో ఉన్నవారిపై కర్రలతో దాడి చేయడంతో గట్టిగా అరవడంతో స్థానికులకు అసలు విషయం తెలిసింది.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం నాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా ఐసీడీఎస్ అధికారులు ఆశ్రమంలో  తనిఖీలు  నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్టు ఐసీడీఎస్ అధికారులు ప్రకటించారు.మరోవైపు బాధితులను గొలుసులతో కట్టేసినట్టుగా కూడ అధికారులు గుర్తించారు. ఈ ఆశ్రమంలో ఎలాంటి సౌకర్యాలు లేని విషయాన్ని  అధికారులు గుర్తించారు.