బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తన భూమిని లాక్కొని, కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై కోర్టు ఆదేశం మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.  

బీసీ సంక్షేమ సంఘం (bc welfare association) జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై (r krishnaiah) కోర్టు రిఫర్ కేసు నమోదైంది. ఆర్ కృష్ణయ్య తమను వేధిస్తున్నాడంటూ రవీందర్ రెడ్డి (ravinder reddy) అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రాయదుర్గం పీఎస్‌లో ఆర్.కృష్ణయ్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రౌడీలతో బెదిరింపులకు పాల్పడ్డాడని రవీందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భూమిని కబ్జా చేసి చంపేందుకు యత్నించాడని అతను ఆరోపిస్తున్నాడు. 

ఇకపోతే.. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏపీ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేశారు సీఎం జగన్. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా బీసీల పార్టీగా ముద్రపడిన టీడీపీని (tdp) జగన్ మరోసారి కోలుకోలేని దెబ్బ కొట్టారని విశ్లేషకులు అంటున్నారు. బీసీ అంటే కృష్ణయ్య.. కృష్ణయ్య అంటే బీసీ అన్నట్లుగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 1994లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి నాటి నుంచి పోరాటం చేస్తున్నారు. ఇన్నేళ్లలో ఆయనను ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు. ఎన్నికలప్పుడు మాత్రం వాడుకుని వదిలేశాయని కృష్ణయ్య వాపోతున్నారు. 

కాకపోతే.. 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అంతేకాదు నాడు తెలంగాణ సీఎం అభ్యర్ధిగా ఆర్ కృష్ణయ్యను టీడీపీ తెరపైకి తెచ్చింది. అనంతరకాలంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా వుంటున్న ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు మద్ధతు ప్రకటించిన కృష్ణయ్య.. ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు .