కేసీఆర్ తోడల్లుడు జోగినపల్లి రవీందర్ రావుపై పోలీస్ కేసు ...
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసింది. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండగా తాజాగా కుటుంబసభ్యులకు కేసులు నమోదవుతున్నాయి.
కరీంనగర్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోడల్లుడు, బిఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు తనపై కూడా జోగినిపల్లి రవీందర్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ మిడ్ మానేరు నిర్వాసితుల సంక్షేమ సంఘం నాయకుడు కూస రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కరీంనగర్ టూటౌన్ పోలీసులు రవీందర్ రావుపై కేసు నమోదు చేసారు.
తాను అక్రమంగా భూదందాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోగినపల్లి రవీందర్ రావు ప్రచారం చేయిస్తున్నారని రవీందర్ ఆరోపించారు. ఇందులో మంత్రి పొన్నం పేరును కూడా వాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా తమపై అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారని... అందుకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించాడు రవీందర్. దీంతో కేసీఆర్ తోడల్లుడితో పాటు యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు చిలకా ప్రవీణ్, గూడ బాలకృష్ణ, నాగరాజు, సంపత్ లపై కూడా కేసులు నమోదు చేసారు. ఇందులో ఏ1గా రవీందర్ రావును చేర్చారు పోలీసులు.
అయితే కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఇలా అక్రమంగా కేసులు పెడుతున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా రవీందర్ రావు దుష్ఫ్రచారం చేయిస్తున్నారని చెబితే కేసులు నమోదు చేయడం ఏమిటి... ఈ కేసుల వెనక కాంగ్రెస్ నాయకులు వున్నారని అంటున్నారు. తండ్రిపై కేసులు పెట్టడంద్వారా ఎంపీ సంతోష్ ను ఇబ్బంది పెట్టాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా బిఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
Also Read Harish Rao: బురద జల్లండి.. కానీ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయండి: హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
ఇదిలావుంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు... చివరకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు సీఎం రేవంత్. దీంతో కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తి పడి ఈ ప్రాజెక్ట్ పనులు నాసిరకంగా జరుగుతున్నా పట్టించుకోలేదని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసారు. అంతేకాదు అసెంబ్లీలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని సీఎం, మంత్రులు ఆరోపించారు. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకున్నారు తప్పితే రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీలేదని మండిపడ్డారు.
ఇక కేసీఆర్ అవినీతి, అక్రమాల చిట్టాను రెడీ చేస్తున్నామని... ఆయనను జైల్లో పెట్టడం ఖాయమంటూ ఇటీవల సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం కేసీఆర్ మాత్రమే కాదు ఆయన అవినీతికి సహకరించిన ప్రతి ఒక్కరినీ శిక్షిస్తామని హెచ్చరించారు. ఇలా కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల అవినీతి భాగోతం బయటపెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వార్నింగ్ వేళ ఎంపీ సంతోష్ తండ్రిపై పోలీసులు కేసు నమోదుచేయడం చర్చనీయాంశంగా మారింది.