మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. పెళ్లికొడుకుకి లవర్ షాకిచ్చింది. అతనిపై కేసు పెట్టడంతోపాటు.. జరగాల్సిన పెళ్లిని కూడా ఆపించింది.  పూర్తి వివరాల్లోకి వెళితే...నల్గొండ జిల్లా, శోభనాద్రిపురం గ్రామానికి చెందిన  యువతి హెరిటేజ్‌సూపర్‌ మార్కెట్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తూ  ఇందిరానగర్‌లో నివాసం ఉండేది. ఐదేళ్ల క్రితం ఆమెకు ఆకుల నరేష్‌ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి తిరిగారు.

కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. బాధితురాలు పలుమార్లు పెళ్లి ప్రస్తావన చేయడా ఎప్పటికప్పుడు దాటవేయడమేగాక గత జూన్‌లో ఆమెకు అబార్షన్‌ చేయించాడు. ఈ నెల 25న ఆమె నరేష్‌ ఫోన్‌లో ఓ యువతి ఫొటోను చూసి నిలదీయగా తన సోదరి అంటూ బుకాయించాడు. అనుమానం వచ్చిన ఆమె అతడి స్నేహితులను ఆరా తీయగా, అతడికి మరో యువతితో పెళ్లి కుదిరిందని, ఈనెల 30న కరీంనగర్‌లో పెళ్లి జరుతుతున్నట్లు తెలిపారు.

దీంతో బుధవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఎక్స్‌ప్రెస్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితుడిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌తో సహా కళ్యాణ మండపానికి చేరుకున్న బాధితురాలు పెళ్లిని నిలిపివేయించింది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.