పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువా కప్పుకుని వచ్చారని ఆరోపణలపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, ఆయన భార్య శైలజ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన పుట్టా మధు మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

ఇవాళ జరుగుతున్న పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకోడానికి మధు తన భార్యతో కలిసి వెళ్లారు. అయితే వీరిద్దరు టీఆర్ఎస్ కండువా  కప్పుకుని పోలింగ్ బూత్ లోకి వెళ్ళారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్దం. దీంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.   

అలాగే  తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో చెదురు మదురుగా కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రముఖులందరు కూడా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ, సినీచ క్రీడా ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిల్చుని మరి ఓటేస్తున్నారు. 

ఇవాళ ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 10 శాతం ఓట్లు పోలైనట్టుగా  ఎన్నికల సంఘం ప్రకటించింది.కొన్ని చోట్ల  చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు అంతరాయం కలుగుతోంది. అలాగే మరికొన్ని చోట్ల గుత్తా జ్వాల వంటి సెలబ్రిటీల ఓట్లు గల్లంతయ్యాయి. ఇలా చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే అన్నిచోట్లా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.