బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో భూపాలపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

భూపాలపల్లి: బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో భూపాలపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భూపాలపల్లి పట్టణానికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తె రక్షిత నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతుంది. అయితే సోషల్ మీడియాలో పోస్టులతో వేధింపులు భరించలేక రక్షిత ఆదివారం వరంగల్‌లోని రామన్నపేటలో బంధువుల ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. 

అయితే భూపాలపల్లికే చెందిన రాహుల్ అనే వ్యక్తి.. రక్షిత గతంలో దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన ఫొటోలు వైరల్ కావడంతో.. తోటి విద్యార్థుల, తెలిసినవారి నుంచి ఆమె ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన రక్షిత బలవనర్మరణం చెందింది.

అయితే ఇందుకు రెండు రోజుల ముందు రక్షిత కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రక్షిత గ్రామానికి తిరిగి రావడంతో వారు పోలీసులకు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత రక్షితను కుటుంబ సభ్యులు.. వరంగల్‌లోని రామన్నపేటలోని బంధువుల ఇంటికి పంపించారు. అయితే సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలు వైరల్ కావడం.. తోటి విద్యార్థులు, గ్రామస్థుల వేధింపులు రక్షిత ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.