Asianet News TeluguAsianet News Telugu

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. ధర్నా చౌక్‌కు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన సందర్భంలో పోలీసులు ఆయనను అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. 
 

police detain TPCC Chief Revanth Reddy
Author
First Published Jan 2, 2023, 12:45 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. సర్పంచ్‌ల నిధుల సమస్యలపై ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్యనేలతను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ధర్నా చౌక్‌కు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన సందర్భంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. 

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ధర్నా చౌక్‌కు తీసుకెళ్లాలని.. ఏదైనా అభ్యంతరం ఉంటే అక్కడే అక్కడ చూసుకోవాలని కోరారు. ప్రతి దానికి ఒక పద్దతి ఉంటుందని అన్నారు. తన ఇంటికి వచ్చే విజిటర్స్‌ను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కార్పొరేటర్ విజయారెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ మండిపడ్డారు. ఆమెను వెంటనే తీసుకెళ్లిన చోటులోనే వదిలి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ధర్నా చౌక్‌ వద్దకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తనను ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

‘‘ప్రగతి భవన్ నుంచి సీఎం బయటకు రారు, సామాన్యులకు ప్రవేశం లేదు. ప్రశ్నిస్తే కేసులు, గృహనిర్బంధాలు ఎదుర్కొంటాం. రాష్ట్రంలో సర్పంచ్‌ల దుస్థితికి వ్యతిరేకంగా ధర్నా చేయకుండా పోలీసులు నా ఇంటిని, ముఖ్య నాయకులందరినీ చుట్టుముట్టారు. ప్రజాస్వామ్యమా...ఎక్కడున్నావు!?’’ అని రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు.

మరోవైపు ప్రగతి భవన్‌ వద్ద నిరసనకు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు నినాదాలు చేశారు. 

ఇక, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. తమను అడ్డుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని  హెచ్చరిస్తున్నారు. తాము రాస్తారోకోలకు, అసెంబ్లీ ముట్టడికి అనుమతి కోరలేదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆదివారం తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను ప్రజాస్వామిక నిరసనల కోసమే ఏర్పాటు చేశారని.. అనుమతి ఇవ్వడానికి పోలీసులు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇందిరాపార్కు వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై నిరసన తెలిపేందుకు తాము అనుమతి అడిగామని చెప్పారు. సర్పంచ్​లకు, పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గ్రామాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని అన్నారు. గ్రామాలకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పెద్ద  ఎత్తున సర్పంచ్‌లు ఇందిరా పార్క్‌ వద్దకు తరలిరావాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios