పాతబస్తీ చార్మినార్ యునాని ఆసుపత్రిలో వైద్య విద్యార్ధిని పట్ల దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌ పరమేశ్‌‌పై వేటు పడింది. జూనియర్ డాక్టర్ పట్ల కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడన్న వార్త తెలుసుకున్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చార్మినార్ పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న పరమేశ్‌ను సస్పెండ్ చేసిన ఆయన.. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని సౌత్ జోన్ డీసీపీకి ఆదేశాలు జారీ చేశారు. చార్మినార్ వద్ద ఉన్న యునాని ఆయుర్వేద ఆసుపత్రిని తరలించొద్దని  విద్యార్ధులు, అధ్యాపకులు బుధవారం నాడు ఆందోళన చేస్తున్నారు

ఆందోళనకారులను అరెస్ట్ చేసే సమయంలో  ఓ కానిస్టేబుల్ ఓ విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డుపైనే బైఠాయించిన విద్యార్ధినిని పైకి లేపేందుకు  మహిళా కానిస్టేబుల్ ప్రయత్నిస్తుంగా కానిస్టేబుల్  విద్యార్ధిని గిల్లాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడ విద్యార్ధినులతో పురుష కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది.