గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన యువకుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. సమయస్పూర్తితో వ్యవహరించి యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసును అందరూ అభినందిస్తున్నారు.
వరంగల్ : అప్పట్లో గుండె పోటు అనే మాట చాలా అరుదుగా వినిపించేది... ఏ యాబై అరవయేళ్లు మీదపడిన వారే ఎక్కువగా గుండె పోటుకు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలి,అహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె పోటుకు గురవుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఆరోగ్యంగా వుంటూనే సడన్ గా రోడ్లపై వెళుతుండగానో, బహిరంగ ప్రదేశాల్లోనో హార్ట్ స్టోక్ కు గురవుతున్నారు చాలామంది. ఇలాంటి వారిని సామాన్యులు, పోలీసులు సిసిఆర్ చేసి కాపాడిన ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇలాంటి ఘటనే వరంగల్ లో వెలుగుచూసింది.
వరంగల్ జిల్లా రేగొండ మండల పరిధిలో వంశీ అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయిన అతడు గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అపస్మారక స్థితిలో పడివున్న వంశీకి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. వెంటనే పోలీస్ వాహనంలో అతడిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలు దక్కాయి. యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రజలు కూడా అభినందిస్తున్నారు.
ఇటీవల కాలంలో గుండె సమస్యలు పెరిగిపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో హార్ట్ స్ట్రోక్ కు గురవుతున్న వారిని కాపాడేందుకు సకాలంలో సిపిఆర్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో సిపిఆర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్డియాక్ అరెస్ట్ గురైన వారికి సకాలంలో సీపీఆర్ అందించే ఉద్దేశ్యంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సిపిఆర్ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రారంభించారు.
ముఖ్యంగా నిత్యం ప్రజల్లో వుండే పోలీసులకు సిపిఆర్ ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారు వైద్య సిబ్బంది. ఈ క్రమంలో గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్స్ కు సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారు వైద్య నిపుణులు. ఇలా నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రాజశేఖర్ అనే కానిస్టేబుల్ కూడా ఇలాగే గుండెపోటుతో కుప్పకూలిన యువకుడి ప్రాణాలు కాపాడాడు. సిపిఆర్ చేసి ఆగిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేసి యువకుడి ప్రాణాలు కాపాడాడు కానిస్టేబుల్.
హైదరాబాద్ లోని ఆరాంఘర్ లోని బస్ స్టాపులో నించున్న ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఇది గమనించి వెంటనే యువకుడి వద్దకువెళ్లి సిపిఆర్ చేశాడు.దాంతో అపస్మారక స్థితిలో పడిపోయిన యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను పోలీస్ అధికారులతో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలోనే పోలీసులందరికీ సిపిఆర్ లో శిక్షణ ఇస్తామని ప్రకటించారు.
