నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు.. రూట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
ఈ నెల 28వ తేదీన గణపతి నిమజ్జనానికి భద్రతాపరమైన ఏర్పాట్లు, అవసరమైన ముందస్తు జాగ్రత్తల గురించి సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో పలు శాఖల చీఫ్‌లు నగరంలో మార్గాలను పరిశీలించారు.

హైదరాబాద్: గణపతి నిమజ్జనం హైదరాబాద్‌లో ఎంత రద్దీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. నగరంలోని జనం దాదాపు రోడ్ల మీదికి వచ్చేస్తారు. వీరందరినీ మేనేజ్ చేయడానికి ట్రాఫిక్ నిర్వహణ కత్తిమీద సాముగా మారిపోతుంది. గణేష్ నిమజ్జనానికి ట్రాఫిక్ నియంత్రణ కోసం సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ రూట్లను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో గణపతి నిమజ్జనం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆయన ట్రాఫిక్, ఎల్ అండ్ వో, ఎస్బీ హెడ్‌లతో ఈ పరిశీలన చేశారు. బాలాపూర్ గణపతి మండపం నుంచి అనేక ముఖ్యమైన కూడళ్లు, గణపతి మండపాలను కలుపుతూ హుస్సేన్ సాగర్ వరకు దారిని పరిశీలించారు.
సుమారు 19 కిలోమీటర్లు రూట్ పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు జరిపిన ఈ ఇన్‌స్పెక్షన్‌లో చాంద్రయాణగుట్ట, చార్మినార్, నయాపూర్, ఎంజే మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రెటేరియట్, పీపుల్స్ ప్లాజాలు కూడా ఉన్నాయి. జోనల్ డీసీపీలు కలిసి సమన్వయంలో పని చేయాలని సీపీ ఆనంద్ సూచించారు.
రూట్ స్పెసిఫికేషన్‌లలో గణపతి ఎత్తును, తక్కువ ఎత్తులో ఉన్న వైర్లు, ఇతర ముఖ్య మైన అంశాలను దృష్టిలో పెట్టుకుని దారులు మళ్లించాలని, ఏ ఎత్తు గణపతి ఏ దారిలో వెళ్లాలో నిర్ణయాలు తీసుకోనున్నారు.
Also Read: జనవరి 22న అయోధ్య రామమందిరంలో ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం! హాజరుకానున్న ప్రధాని మోడీ
సిటీ పోలీసు సిబ్బందితోపాటు జిల్లాల నుంచి అదనపు సిబ్బందినీ, ఇతర సంబంధ శాఖల నుంచి సిబ్బంది నిమజ్జనం రోజు మోహరించనున్నారు. మొత్తం 25,694 సిబ్బంది మోహరించనున్నారు. మూడు ఆర్ఏఎప్ కోయ్‌లు, ఇతర పారామిలిటరీ బలగాలు కూడా డ్యూటీలో ఉంటారు. సీసీటీవీలను పరిశీలించారు. రిపేర్లు అవసరమున్న చోట చేశారు. నగరంలోని చాలా రోడ్లను రెగ్యలర్ ట్రాఫిక్‌కు క్లోజ్ చేశారు. లేదా దారి మళ్లించారు.
క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్లు, యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్‌లు, షీ టీమ్‌లు కూడా మోహరిస్తాయి. జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, ట్రాన్స్‌కో, వాటర్ వర్క్స్, ఆర్టీఏ, మెడికల్ హెల్త్ వంటి శాఖలన్నీ 28వ తేదీన పూర్తిస్థాయిలో పని చేస్తాయి. ప్రజలు అధికారులతో సహకరించి ఈ నిమజ్జనానికి ఒక మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు లేని నిమజ్జనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.