ఎన్నికల వేళ.. కారులో రూ.5కోట్లు దొరకడం జనగామలో కలకలం రేగింది. మరో మూడు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు డబ్బులు పంచే అవకాశం ఎక్కువగా ఉండటంతో.. పోలీసులు విస్తృతంగా దాడులు చేపడుతున్నారు. కాగా.. ఈ తనిఖీల్లో భాగంగా వరంగల్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై పెంబ‌ర్తి చెక్‌పోస్టు వద్ద రూ.5కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న స్విఫ్ట్‌ కారును తనిఖీ చేయగా రూ. 5 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధిత వాహనాన్ని, నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న నగదు విషయమై వరంగల్‌ సీపీ రవీందర్‌ జనగామలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే అవకాశముంది.