హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని అమ్నేషియా, ఇన్సోమినియా పబ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని అమ్నేషియా, ఇన్సోమినియా పబ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 10 గంటల దాటిన తర్వాత కూడా ఈ రెండు పబ్‌ల్లో సౌండ్ అనుమతించడంతో కేసు నమోదు చేసినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. పబ్‌ల యజమానులు రాజా శ్రీకర్, కునాల్, మేనేజర్ యూనిస్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక, హైదరాబాద్‌లోని పబ్‌ల్లో రాత్రి 10 గంటల తర్వాత సంగీతం వినిపించడం శబ్ద (కాలుష్యం) నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సింగిల్ జడ్జి సెప్టెంబర్ 12వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నగరంలోని పబ్, బార్ యజమానులు దీనిపై అప్పీల్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం వారి అప్పీళ్లను విచారించింది.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలు మినహా హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, బార్‌లు, ఇతర వినోద వేదికల్లో రాత్రి 10 గంటల తర్వాత సంగీతాన్ని వాయించడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ నిషేధాన్ని ఎత్తివేసింది. రాత్రి 10 గంటల తరువాత జూబ్లీహిల్స్ పబ్‌లలో ఎలాంటి మ్యూజిక్ సౌండ్ పెట్టడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
