కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి ఘటనలో నిందితుడిపై కేసు నమోదు.. సిద్దిపేట సీపీ శ్వేత

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

Police case on accused in attack over BRS MP Kotha Prabhakar Reddy ksm

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత స్పందించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్‌ రెడ్డిపై మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజు (38) అనే వ్యక్తి క‌త్తితో దాడి చేశారని  చెప్పారు. దీంతో ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

తీవ్ర రక్తస్రావంతో బాధ‌ప‌డుతున్న ప్రభాకర్‌ రెడ్డిని ప్రాథమిక చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ దవాఖానకు త‌ర‌లించామని, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారు.   ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. 

ఇదిలా ఉంటే, కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స  జరుగుతుంది. మంత్రి హరీష్ రావు కూడా యశోద ఆస్పత్రికి చేరుకుని కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. 

ఇక, ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్పందించారు. మంత్రి హరీష్ రావుతో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్.. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..  కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ‘‘నేను జుక్కల్‌లో ఉన్నప్పుడే వార్త వచ్చింది. వాస్తవానికి అక్కడికి వెళ్లాలనుకున్నాను. అక్కడ హరీశ్‌రావు, మిగతా మంత్రులు ఉన్నారు. ప్రభాకర్‌రెడ్డి ప్రాణానికి ఇబ్బంది లేద‌ని చెప్పారు. మీ కార్యక్రమం ముగించుకొని రండి మేమంతా ఉన్నాం.. ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. భగవంతుడి దయతో అపాయం తప్పింది’’ అని కేసీఆర్ అన్నారు.

ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయటమంటే.. తనపై దాడి జరిగినట్లేనని అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడితే సహించేది లేదని చెప్పారు. ఈ ర‌క‌మైన దాడుల‌ను ప్ర‌తి ఒక్క‌రూ ముక్త‌కంఠంతో ఖండించాల‌ని ప్రజలను కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios