తమ ఇంట్లో అద్దెకు ఉండే ఓ బాలికపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అయినా బాలిక పట్టించుకోకపోవడంతో... ఎవరూ లేని సమయంలో బలత్కారం చేశాడు. దానిని వీడియో తీసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తరచూ అతను అలా వీడియో చూపించి.. బెదిరించి అత్యాచారం చేయడంతో బాలిక విసిగిపోయింది. అతని వేధింపులు తట్టుకోలేక ఎదురు తిరిగింది. 

చావనైనా చస్తాను కానీ.. నువ్వు చెప్పిన దానికి అంగీకరించనని బాలిక తెగేసి చెప్పడంతో.. అయితే చచ్చిపో అంటూ ఆ కిరాతకుడు విషం తెచ్చి ఇచ్చాడు. వెంటనే బాలికపై ఆ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో బాలిక ప్రస్తుతం చావు బతుకుల్లో పోరాడుతోంది. ఈ సంఘటన జీడిమెట్లలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇంటి వద్దే ఉంటోంది. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది. వారు అద్దెకు ఉండే ఇంటి యజమాని కుమారుడు వై. మధుసూదన్‌రెడ్డి ఆమెను ప్రేమిస్తున్నాని వెంటపడేవాడు. ఆమె తండ్రి ఫోన్‌కు కాల్‌ చేసి, బాలికను మాట్లాడమని వేధించేవాడు. ఆమె తండ్రి డ్యూటీ నుంచి వచ్చే భార్యను తీసుకురావడానికి రోజూ వెళ్తాడు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. విషయం తెలిసిన మధుసూదన్‌ ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి, తలుపులు మూసి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్ని వీడియో కూడా తీశాడు. ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తానని, వీడియోలు, ఫొటోలు బయటపెడతానని తరచూ లైంగికదాడికి పాల్పడేవాడు.

ఈ నెల 10న బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మరోసారి లైంగికదాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించింది. బలవంతం చేస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరించింది. అయితే, మధుసూదన్‌ సోమవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఉన్న బాలిక దగ్గరకు వచ్చి ‘నాకు లొంగితే సరే.. లేదంటే చచ్చిపో’ అంటూ విషం బాటిల్‌ ముందు పెట్టాడు. దీంతో ఆమె విషం తాగింది. ఆమె పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. బాలిక స్ప్రహలోకి రావడంతో పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.