తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని... హాస్టల్స్ లో చేర్పిస్తారు. తమ పిల్లల రక్షణ హాస్టల్ వార్డెన్  చేతిలో పెడతారు. వాళ్లని తండ్రిలాగా కాపాడాల్సిన వార్డెన్... పశువులా మారాడు. చిన్నారులని కూడా చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పశువులాగా అర్థరాత్రి నిద్రలేపి.... నోటికి ప్లాస్టర్ అంటించి మరీ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హాస్టల్ నిర్వహిస్తోంది. కాగా... హాస్టల్ లో చేరిన విద్యార్థులపై వార్డెన్ లింగన్న లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేయడం విశేషం.

ప్రిన్సిపల్ అతనికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడం గమనార్హం. చిన్నారులను అర్థరాత్రి లేపి.. నోటికి ప్లాస్టర్ అంటించి.. అగరబత్తీలతో కాల్చి...చిత్రహింసలకు గురిచేసేవాడు. అతని బాధలు తట్టుకోలేకపోయిన చిన్నారులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా.. వారు హాస్టల్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. 

గతంలో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, పిల్లల పరువుపోతుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆగిపోయామని తెలిపారు. అదే సమయంలో వార్డెన్‌ కనిపించడంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. సీఐ నరేశ్, ఎస్సై అనిల్‌ విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. వార్డెన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు.