హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు గురువారం నాడు అన్ని డిపోలను కలుపుతూ  తలపెట్టిన బైక్ ర్యాలీలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొన్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఓయూ జేఎసీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది దీంతో ఓయూ వద్ద రెండు గేట్లను పోలీసులు మూసివేశారు. తెలంగాణ బంద్ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై జేఎసీ నేతలు, రాజకీయ పార్టీలు సమావేశమయ్యాయి.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు.  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ బ్రేక్ వేశారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్‌జీవోలు, రెవిన్యూ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచారు.

ఈ నెల 19న బంద్ కు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు ఇవాళ  బైక్ ర్యాలీల నిర్వహణకు ప్లాన్ చేశారు.అయితే బైక్ ర్యాలీల నిర్వహణను  పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొన్నారు.  ఓయూ జేఎసీ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే ప్రగతి భవన్  ముట్టడికి ఓయూ జేఎసీ నేతలు రాకుండా పోలీసులు గేట్లు మూసివేశారు.

ఇందిరాపార్క్ వద్ద వామపక్ష నేతలు ఆర్టీసీ జేఎసీ కార్మికుల సమ్మెకు సంఘీభావ దీక్షను చేపట్టారు.ఈ దీక్షను మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, ప్రోఫెసర్ నాగేశ్వర్ లు ప్రారంభించారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపషథ్యంలో ఓయూ జేఎసీ నేతలను ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వథామరెడ్డి గురువారం నాడు కలిశారు. తమ సమ్మెకు సంఘీభావం ప్రకటించాలని కోరారు.మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికులు కూడ ప్రభుత్వంతో  చర్చలకు కేశవరావు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కూడ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 18వ తేదీ లోపుగా ఆర్టీసీ సమ్మెకు సంబంధించి చర్చల విషయమై నిర్ణయాన్ని తెలపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అంతేకాదు సెప్టెంబర్ మాసానికి సంబంధించిన వేతనాలను సోమవారం లోపుగా చెల్లించాలని కూడ ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.