తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. ఇంటర్ బోర్డు అవకతవకలతో పాటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్ధులు బలన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు.

దీనితో పాటు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో సైతం ఇంటర్ బోర్డు, గ్లోబరీనా సంస్థల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం ఇంటర్ బోర్డు ముట్టడికి బయలుదేరిని కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే బోర్డు పరిసరాల వద్ద తల్లిదండ్రులు, విద్యార్ధులు, విద్యార్ధి సంఘాల నాయకులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

అలాగే పలువురు సీపీఐ, టీజేఎస్, కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌లను ఉత్తమ్, చాడ వెంకట్ రెడ్డి, కోదండరామ్ ఖండించారు.