తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున ఆయనను అవమానించేలా వేడుకలు జరిపారంటూ ఎన్ఎస్ యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున (kcr birthday) నిరసనలకు సిద్దమైన కాంగ్రెస్ (telangana congress) నాయకుల అరెస్టులు నిన్న(గురువారం) ఉదయం ప్రారంభమై అర్దరాత్రి వరకు కొనసాగాయి. నిన్న ఉదయమే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy)ని అరెస్ట్ చేయడమే కాదు పలువురు కీలక నాయకులను హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. అయితే పోలీస్ నిర్బందాన్ని దాటుకుని ఎన్ఎస్ యూఐ (NSUI) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (balmoori venkat) వినూత్న రీతిలో కేసీఆర్ పుట్టినరోజు వేడుక జరపారు. ఇది ముఖ్యమంత్రిని అవమానించేలా వుండటంతో అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవగా అర్ధరాత్రి అరెస్ట్ చేసారు.

తెలంగాణ కాంగ్రెస్ పిలుపుమేరకు వెంకట్ ఎన్ఎస్ యూఐ నాయకులతో కలిసి కరీంనగర్ లో వినూత్నంగా నిరసన తెలిపారు. ఓ గాడిదకు కేసీఆర్ చిత్రపటం పెట్టి పుట్టినరోజు వేడుక జరిపారు. దీంతో టీఆర్ఎస్(trs) నాయకులు వెంకట్ పై పోలీసులకు పిర్యాదు చేసారు. ఇలా రెండు పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు అందడంతో రెండు చోట్ల వెంకట్ పై కేసులు నమోదయ్యాయి. 

ఈ క్రమంలోనే గురువారం అర్దరాత్రి హుజురాబాద్ లోని తన నివాసానికి వెళుతుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న జమ్మికుంట పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. పోలీస్ వాహనంలో అతన్ని జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

అరెస్ట్ సమయంలో పోలీసులకు, వెంకట్ కు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా రోడ్డుపై పట్టుకుని అరెస్ట్ చేయడం సరికాదని వెంకట్ అన్నారు. మేము పిర్యాదులు చేస్తే పట్టించుకోని పోలీసులు టీఆర్ఎస్ నాయకులు పిర్యాదు చేస్తే మాత్రం వెంటనే కేసులు నమోదు చేసి ఇలా అర్ధరాత్రులు అరెస్ట్ లు చేస్తున్నారని మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసినట్లే తమ నాయకుడు రాహుల్ గాంధీ గురించి అనుచితంగా మాట్లాడిన అసోం సీఎం హేమంత బిస్వ శర్మను అరెస్ట్ చేయాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేసారు. 

ఇదిలావుంటే జమ్మికుంటతో పాటు కరీంనగర్ లోనూ బల్మూరి వెంకట్ పై మరో కేసు నమోదయినట్లు సమాచారం. శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో కూడా ఎన్ఎస్ యూఐ ఆద్వర్యంలో గాడిదకు కేసీఆర్ చిత్రపటం పెట్టి ఊరేగిస్తూ బర్త్ డే వేడుక జరిపారు. ఇది వెంకట్ ఆధ్వర్యంలో జరిగిందని ఫిర్యాదు అందండంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు గురువారం ఉదయమే అరెస్ట్ చేశారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా వివిధ రూపాల్లో నిరసన తెలపాలని యువజన కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రేవంత్ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

అలాగే మరికొందరు కీలక నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్టులు చేసారు. నిరసన చేపట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత, అంజన్ కుమార్ యాదవ్‌ను కూడా అరెస్ట్ చేసారు. ఆయన అరెస్ట్ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనను అరెస్ట్ చేయడంతో అంజన్ కుమార్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తాము పార్లమెంట్‌లో కోట్లాడి తెలంగాణ తెచ్చామని అన్నారు. కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు.