ఆదిలాబాద్ పట్టణంలో కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ కాల్పులు జరపడంతో పాటు కత్తితోనూ విరుచుకుపడ్డాడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాల్పులు జరిపిన ఫరూక్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు ఐజీ నాగిరెడ్డి. కాల్పుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు ఆయన తెలిపారు.

నిందితుడు ఫరూఖ్ లైసెన్స్‌డ్ గన్‌తోనే కాల్పులకు తెగబడినట్లు ఐజీ వెల్లడించారు. దీంతో అతని నుంచి తుపాకీ, తల్వార్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేశామని తెలిపారు.

రెండు కుటుంబాల మధ్య గల పాత గొడవలు ఇవాళ జరిగిన పిల్లల తగాదా కాల్పులకు దారి తీసింది. చాలాకాలంగా ఫారుఖ్, మోసిన్ కుటుంబాలు ఒకే పార్టీలో వున్నాయి. అయితే మోసిన్ కుటుంబం టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో వివాదం మొదలైంది.

ఈ క్రమంలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా జరిగిన గొడవ కాల్పుల వరకు వెళ్లింది. ఫారుఖ్ ప్రత్యర్థులను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఓ యువకుడు పారిపోతుంటే వెంట పడి కాల్చాడు.