Asianet News TeluguAsianet News Telugu

రామగుండం రియల్టర్ హత్యకేసులో ట్విస్ట్... చంపింది అబ్బాయేనట..! (వీడియో)

పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకేసును కేవలం ఒక్కరోజులోనే చేధించారు పోలీసులు.

Police arrested four people in Realtor Murder case in Ramagundam AKP
Author
First Published Sep 20, 2023, 4:55 PM IST

పెద్దపల్లి : రామగుండం ఎన్టిపిసి సమీపంలో రియల్టర్ ను అత్యంత కిరాతకంగా చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. రియల్టర్ కు కొడుకు వరసయ్యే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. భూతగాదాలే రియల్టర్ హత్యకు కారణంగా పోలీసులు  పేర్కొంటున్నారు. 

రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామగుండం సమీపంలోని కాజిపల్లి గ్రామానికి చెందిన మేకల లింగయ్య రియల్ ఎస్టేట్ చేసేవాడు. ఇటీవల కొడుకు వరసయ్యే మేకల కుమారస్వామితో కలిసి భూముల కొనుగోలు, అమ్మకం చేయసాగాడు. బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ తో పాటు పాల వ్యాపారం కూడా చేసారు. అయితే వ్యాపార లవాదేవీల్లో తేడాలు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే లింగయ్య హత్యకు కుమారస్వామి కుట్ర పన్నినట్లు సిపి తెలిపారు. 

వీడియో

బావమరిది శంకర్, స్నేహితుడు విద్యాసాగర్, డ్రైవర్ అనిల్ తో కలిసి లింగయ్య హత్యకు ప్లాన్ వేసాడు కుమారస్వామి. ప్రతిరోజూ రాత్రి కొద్దిసేపు లింగయ్య వాకింగ్ చేస్తాడు... ఇదే అతడిని అంతమొందించేందుకు సరైన సమయమని భావించారు. ఈ క్రమంలోనే ఈ నెల 18న రాత్రి ఈ నలుగురు లింగయ్య కోసం కాపుకాసారు. అతడు ఒంటరిగా నడుచుకుంటూ రాగానే వెంటతెచ్చుకున్న కత్తులు, కొడవళ్లతో మెడపై నరికారు. దీంతో అక్కడే కుప్పకూలిన లింగయ్య చనిపోయాడని నిర్దారించుకుని అక్కడి నుండి పరారయ్యారు.

Read More  పెద్దపల్లిలో దారుణం... కత్తులతో మెడనరికి రియల్టర్ దారుణ హత్య

రక్తపుమడుగులో పడివున్న లింగయ్య మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు తమకు సమాచారం అందించగా విచారణ ప్రారంభించినట్లు సిపి రాజేశ్వరి తెలిపారు. ఈ హత్యకేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం ఒక్కరోజులోనే  చేధించామని సిపి అన్నారు. విబేధాల కారణంగానే లింగయ్యను కొడుకు వరసయ్యే కుమారస్వామి చంపారని... అతడి మరో ముగ్గురు సహకరించారని అన్నారు. నలుగురు నిందితులతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తులను కూడా స్వాదీనం చేసున్నట్లు సిపి తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమీషనర్ రాజేశ్వరి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios