Asianet News TeluguAsianet News Telugu

క్రైం ఫ్రం హోమ్‌ : లాప్ టాప్ లు అద్దెకు తీసుకుని.. ఆన్ లైన్ లో అమ్మేసుకుని..

ఈజీగా మనీ సంపాదించాలనుకున్న నలుగురు ఇంజనీర్లు ఇప్పుడు కటకటాల పాలయ్యారు. వర్క్ ఫ్రం హోంను అనువుగా మార్చుకుని నేరాలు చేసి నేరుగా జైల్లో పడ్డారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నకిలీ ఐటీ కంపెనీల ముసుగులో భారీగా ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకుని, ఆ తరువాత వాటిని సెకండ్‌ హ్యాండ్‌ పేరుతో ఆన్‌లైన్‌లో అమ్మేసి సొమ్ము చేసుకున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Police arrested a Bangalore Gang Crimes In The Name Of Work From Home at Hyderabad - bsb
Author
Hyderabad, First Published Dec 10, 2020, 9:20 AM IST

ఈజీగా మనీ సంపాదించాలనుకున్న నలుగురు ఇంజనీర్లు ఇప్పుడు కటకటాల పాలయ్యారు. వర్క్ ఫ్రం హోంను అనువుగా మార్చుకుని నేరాలు చేసి నేరుగా జైల్లో పడ్డారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నకిలీ ఐటీ కంపెనీల ముసుగులో భారీగా ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకుని, ఆ తరువాత వాటిని సెకండ్‌ హ్యాండ్‌ పేరుతో ఆన్‌లైన్‌లో అమ్మేసి సొమ్ము చేసుకున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఐటీ హబ్స్‌నే టార్గెట్‌గా చేసుకున్న ఈ ముఠా హైదరాబాద్‌తో పాటు బెంగళూర్‌లోనూ నేరాలు చేసింది. వీరి గుట్టురట్టు చేసిన అక్కడి బైపనహల్లి పోలీసులు ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు. వీళ్లలో ఓ నిందితుడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. బెంగళూర్‌లోని కమ్మనహల్లి ప్రాంతానికి చెందిన సైఫ్‌ పాషా ఈ ముఠాకు సూత్రధారి. అక్కడి వీరప్పనపాల్య, హెన్నూర్‌ బాండే వాసులైన మొయినుద్దీన్‌ ఖురేషీ, ప్రతీక్‌ నాగర్కర్, అశ్వఖ్‌లతో ముఠా కట్టాడు. ఈ నలుగురూ ఇంజనీరింగ్‌ డ్రాపవుట్స్. 

కొన్నాళ్ల క్రితం చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశారు. అవి నష్టాలనే మిగల్చడంతో డబ్బు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. కరోనా ప్రభావంతో ల్యాప్‌టాప్‌లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ల్యాప్‌టాప్‌లను అద్దెకు ఇచ్చే సంస్థలు పోటీ పడి మరీ అద్దెకివ్వడం ప్రారంభించాయి. 

ఇది చూసిన సైఫ్‌కు కొత్త ఆలోచన వచ్చింది. బెంగళూర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని గ్రహించి రెండుచోట్లా వేర్వేరు ముఠాలను ఏర్పాటు చేశాడు. ముందుగా వీరు రెండుమూడు నకిలీ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేశారు. వాటి పేరుతో లెటర్‌హెడ్‌లు తదితరాలు రూపొందించారు. వీటి సాయంతో పలు సంస్థల నుంచి ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇచ్చే వారికి అడ్వాన్స్‌గా పోస్ట్‌ డేటెడ్‌ చెక్కుల్ని ఇచ్చారు. 

కరోనా వల్ల  తమ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని మూసేస్తున్నామని.. ల్యాప్‌టాప్‌లను సెకండ్‌ హ్యాండ్‌లో అమ్ముతున్నామని ఆన్ లైన్ లో ప్రచారం చేసుకున్నారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన ల్యాప్‌టాప్‌ సంస్థలు బెంగళూర్‌లోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని సీసీఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠాకు చెందిన కొందరిని పట్టుకున్న సీసీఎస్‌ పోలీసులు సూత్రధారి సైఫ్‌ కోసం గాలింపు ముమ్మరం చేశారు. 

మరోపక్క ఈ ముఠా వ్యవహారంపై సమాచారం అందుకున్న బెంగళూర్‌లోని బైపనహెల్లీ పోలీసులు సోమవారం సైఫ్‌తో పాటు మొయినుద్దీన్, ప్రతీక్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.45 లక్షల విలువైన 97 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్‌ పోలీసులు బెంగళూర్‌ చేరుకుని సైఫ్‌ను తమ కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. పరారీలో ఉన్న అశ్వఖ్‌ కోసం గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios