మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటూనే ఉంటారని మరోసారి రిపీట్ అయ్యింది. మోసం చేసే విధానం మారుతుందేమో కానీ.. మోసపోయేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా.. హైదరాబాద్ నగరంలో నయా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ పేరిట  ఓ యాప్ ని తయారు చేసి.. దాని నుంచి మేల్ ఎస్కార్ట్ కావాలంటూ ఎర వేసి.. ఓ యువకుడి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కాజేశారు. ఈ సంఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో ఓ డేటింగ్‌ యాప్‌ను ఓపెన్‌ చేశారు. పేరు, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపించాయి.  కొద్ది సేపటికే రీమా అనే యువతి ఫోన్‌ చేసి విదేశీయులకు సహాయంగా వెళ్లేందుకు మేల్‌ ఎస్కార్ట్‌ జాబ్‌ ఉందని చెప్పింది. మాటల్లో పెట్టి డేటింగ్‌ కోసం అందమైన అమ్మాయిలను పంపుతామని నమ్మించింది. యువతి మాయమాటలకు ఆకర్షితుడైన సదరు వ్యక్తి మొదట రూ. 2,500 ఆన్‌లైన్‌లో చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జాయినింగ్‌ ఫీజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్, వీఐపీ మెంబర్‌షిప్‌లు, ప్రోడక్ట్‌ పర్చేజ్‌ ఫీజ్, లేట్‌ పీజ్, ఇన్సూ్యరెన్స్, రీఫండ్‌ అమౌంట్‌ పేరిట ఏకంగా రూ. 13,83,643 ఆన్‌లైన్‌లో చెల్లించారు. 

డేటింగ్‌ కోసం మీ ప్రాంతంలో అమ్మాయిలు అందుబాటులో లేరని బుకాయిండంతో తన వెనక్కు ఇవ్వాలని అడిగారు. చెల్లిస్తామని చెప్పి ఫోన్‌ పెట్టేసిన తరువాత ఆ ఫోన్‌ కలవక పోవడంతో మోసాన్ని బాధితుడు సెప్టెంబర్‌ 18న సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్‌ చెందిన మరో వ్యక్తి ఆ వెబ్‌సైట్‌ ఓసెన్‌ చేసి మొబైల్‌ నంబర్, పేరు ఎంటర్‌  చేశారు.

 త్రిష అనే యువతి మాట్లాడి మొదట ఎస్కార్ట్‌ జాబ్‌ ఇస్తామని, తరువాత మాటల్లో పెట్టి అమ్మాయిలను డేటింగ్‌కు పంపిస్తామని నమ్మబలికింది. రూ. 1,500 ఆన్‌లైన్‌లో చెల్లించాడు. మెంబర్‌ షిప్, జీఎస్‌టీ అంటూ వివిధ పేర్లు చెప్పి బ్యాంక్‌ అకౌంట్‌కు ఆన్‌లైన్‌లో రూ. 1,15,700 చెల్లించాడు. మాయ మాటలుగా గుర్తించి అక్టోబర్‌ ఒకటిన సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. ప్రధాన నిందితుడు మినహా మిగిలిన నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందుతుడి కోసం గాలిస్తున్నారు.