కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో.. తెలంగాణ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 9 తర్వాత ఎవరూ ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టకూడదు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి అర్థరాత్రి దొంగతనానికి పాల్పడ్డాడు. అలా దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఏకే జిలానీ తెలిపిన వివరాలు.. తార్నాకకు చెందిన కిశోర్‌ (34) ఓవైసీ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుండడంతో మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ ఉప్పుగూడ శివాజీనగర్‌లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలో బస్తీలోని ఓ ఇంట్లోకి ప్రవేశిస్తున్న కిశోర్‌ను పోలీసులు ప్రశ్నించడంతో తడబడుతూ కనిపించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు అంగీకరించాడు. ఇతడు గతంలో కూడా సెల్‌ఫోన్‌ దొంగతనంతో పాటు మరో చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.