భార్య తనని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పాలు పోసే వ్యక్తితో ఆమె ప్రేమాయణం రోజు రోజుకీ కొనసాగిస్తోంది. తొలుత అతను నమ్మలేదు. చాలాసార్లు చూసిన తర్వతా అతనిలో అనుమానం మొదలైంది. ఆ అనుమానం అతనిలోని రాక్షసుడిని నిద్రలేపింది. దీంతో... భార్యతో చనువుగా ఉంటున్న ఆమె ప్రియుడిని అతి దారుణంగా హత్య చేశాడు.

ఈ సంఘటన నల్గొండ జిల్లా అనుముల లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల వ్యాపారం చేసే రేవంత్‌కుమార్‌ ప్రతి రోజు హజారిగూడెం వెళ్లేవాడు. అక్కడ పలు ఇళ్లల్లో పాలు పోసేవాడు. అయితే... రేవంత్ కుమార్.. పాలు పోయడానికి వచ్చి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని జానపాటి హరికృష్ణ భావించాడు. ఈ విషయంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. 

Also Read చెల్లెలిపై అన్న అత్యాచారం: అవమానంతో బాలిక ఆత్మహత్య...

ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య అతని మాట వినకపోవడంతో రేవంత్ కుమార్ ని చంపాలని అనుకున్నాడు. దీనిలో భాగంగా హరికృష్ణ తన తమ్ముడు రామాంజనేయులతో కలిసి ప్లాన్ వేశాడు. సాగర్‌కు చెందిన చింతమళ్ల కన్నయ్య, చింతమళ్ల రాజేష్‌తో కలిసి రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

రేవంత్‌కుమార్‌ను చంపేందుకు మూడు సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ నెల ఐదో తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు హరికృష్ణ, రాజేష్‌, మహేష్‌, రామాంజనేయులు కలిసి హజారిగూడెం స్టేజీ సమీపంలో చెట్ల పొదల్లో మాటు వేశారు. అదే సమయంలో పాల కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రేవంత్‌కుమార్‌పై ఒక్కసారిగా దాడి చేసి రాడ్లతో కొట్టి, కొడవళ్లతో ముఖం, తలపై విచక్షణారహితంగా కొట్టడంతో మృతి చెందాడు.

మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో హరికృష్ణ సుపారీ ఇచ్చి మరీ హత్య చేసినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేశామని అంగీకరించారు.