తాగిన మైకంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్య గొంతు  కోసేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన తుకారాం అనే వ్యక్తికి మండల కేంద్రానికి చెందిన రాధాబాయితో 11సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె ఉన్నారు.

ఆరేళ్ల కిందట మండలంలోని ధనోరా(బి) గ్రామానికి వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తుకారం మద్యానికి బానిసై భార్యను తరచూ వేధిస్తూ ఉండేవాడు. భర్త వేధింపులు ఎక్కువ అవడంతో 2019లో ఒకసారి రాధాబాయి పోలీసులను కూడా ఆశ్రయించింది.

అప్పుడు పోలీసులు ఇరువురికీ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఆ తర్వాత ఇద్దరూ అన్యోన్యంగానే ఉండటం మొదలుపెట్టారు. అయితే.. గురువారం దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో.. తుకారాం పీకలదాకా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశంలో తుకారాం భార్య గొంతును బ్లేడ్ తో కోసేశాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా.. తుకారాం ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.