Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో మోసం.. అధికారుల కళ్లుగప్పి ఖమ్మం జిల్లాకు...

ఇద్దరి పేర్లు దగ్గరగా ఉండటంతో.. అతని పేరుతో పాస్ పోర్టు సంపాదించాడు. అనంతరం తల్లిదండ్రుల ద్వారా ఆ పాస్ పోర్టును అమెరికాకు రప్పించుకున్నాడు. 

Police Arrest the Man who cheated people in America And came to india with fake visa
Author
Hyderabad, First Published Feb 6, 2021, 7:30 AM IST

అమెరికాలో మోసాలకు పాల్పడి శిక్షకు గురైన ఓ యువకుడు.. అక్కడి అధికారుల కళ్లుగప్పి భారత్ కి చేరాడు. చివరకు ఇక్కడ పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మొర్రిశెట్టి రవి 2016 నుంచి అమెరికాలో ఉంటూ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ బిజినెస్ చేశాడు. ఆ వ్యాపారంలో మోసానికి పాల్పడటంతో అక్కడి పోలీసులు రవిని అరెస్టు చేసి పాస్ పోర్ట్ సీజ్ చేశారు. కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు 7లక్షల డాలర్ల జరిమానా విధించింది. అప్పీలుపై బయటకు వచ్చిన నిందితుడు ఈ శిక్ష నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో అతని సోదరుడైన మొరిశెట్టి రవికిరణ్ కారేపల్లిలో వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరి పేర్లు దగ్గరగా ఉండటంతో.. అతని పేరుతో పాస్ పోర్టు సంపాదించాడు. అనంతరం తల్లిదండ్రుల ద్వారా ఆ పాస్ పోర్టును అమెరికాకు రప్పించుకున్నాడు. దాని ఆధారంగా రవి 2020లో కారేపల్లికి చేరుకున్నాడు.

కాగా.. అమెరికాలో ఉన్న సమయంలో రవికి కర్నూలుకు చెందిన అశోక్ అనే వ్యక్తితో స్నేహం ఉండేది. అక్కడ ఉండగానే పలు కారణాలు చెప్పి అతని వద్ద 1.56లక్షల డాలర్లు అప్పు తీసుకున్నాడు. తర్వాత కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన అశోక్ కర్నూలులోనే ఉంటున్న తన సోదరుడు క్షత్రపతికి ఈ విషయం తెలిపాడు. ఆయన గతేడాది జూన్ లో ఖమ్మం కమిషనరేట్ లో ఫిర్యాదు చేశాడు.

దానిపై పోలీసులు విచారించడంతో రవి బండారం బయటపడింది. దీంతో కారేపల్లి పోలీసులు రవి సోదరులను గురువారం అరెస్టు చేసి ఇల్లెందు కోర్టుకు రిమాండ్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios