ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఆశచూపించారు. వాళ్లు చెప్పినదాన్ని నిజమని నమ్మి.. వాళ్లు అడిగిన సొమ్ము చేతిలో పెట్టారు. కానీ చివరకు ఆ డబ్బులు తీసుకొని.. ఉద్యోగం ఇవ్వకుండా టోకరా ఇచ్చారు. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రవీందర్.. ఆటో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన బత్తిని వైకుంఠం పొలం పనులు చేస్తుంటాడు. కొండాపూర్ కి చెందిన బందెమ్మ గృహిణి. కాగా.. వీరి ముగ్గురికి సంగారెడ్డి పట్టణానికి చెందిన విజయ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది.

హైదరాబాద్‌ సచివాలయంలో తనకు పరిచయాలు ఉన్నాయని విజయకుమార్‌ నమ్మబలికడంతో రవీందర్, వైకుంఠం అతనికి సహాయకులుగా ఉన్నారు. కాగా బందెమ్మ  25 మంది వద్ద నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండేళ్లుగా రూ.67 లక్షలు వసూలు చేసి వారికి అప్పగించింది. నిరుద్యోగులకు నకిలీ నియామక పత్రాలు అందజేశారు. విషయం తెలుసుకున్న డబ్బులు ఇచ్చిన పలువురు బాధితులు బందెమ్మను నిలదీశారు.


దీంతో తాను తప్పించుకోవడానికి డబ్బులు తీసుకొని రవీందర్, వైకుంఠం, విజయకుమార్‌లు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారని నవంబర్‌ 9వ తేదీన సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె సంగారెడ్డి మార్క్స్‌నగర్‌లో నివాసం ఉంటోంది. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా నకిలీ ముఠాగుట్టు రట్టయ్యింది. పోలీసుల దర్యాప్తులో ఆమె సైతం నిందితురాలు అని తెలింది. దీంతో ఆమెతో పాటు రవీందర్, వైకుంఠాన్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి బ్యాంకు చెక్‌ బుక్కులు,  మొబైల్‌ ఫోన్లు, నకిలీ నియామక పత్రాలను స్వాధీన పరుచుకున్నారు. కాగా విజయకుమార్‌ పరారీలో ఉన్నాడు.  ఆ ముగ్గురిని జ్యూడిషయల్‌ కస్టడీకి తరలించారు.