అతను చదివింది కేవలం పదో తరగతే. కానీ.. తానొక డాక్టర్ నంటూ అందరినీ నమ్మించాడు. సూటు, బూటు వేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా డాక్టర్ లా చలామణి అవుతూ వస్తున్నాడు. కాగా.. ఈ దొంగ డాక్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్‌ పనిచేస్తున్నాడని పక్కా సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికెట్‌తో డాక్టర్‌గా అవతారం ఎత్తిన ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన పది వరకే చదివి ఫేక్‌ సర్టిఫికెట్లతో ఇలా డాక్టర్‌ అయ్యాడని తెలుసుకున్న పోలీసులు, జనాలు విస్తుపోయారు. 

ఆ నకిలీ డాక్టర్‌తో పాటు ఆస్పత్రి యజమాని షోహెబ్‌ను కూడా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన యజమాని, ఫేక్ డాక్టర్ వద్ద నకిలీ సర్టిఫికేట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అసలు వీరికి సర్టిఫికేట్స్ ఎవరు ఇచ్చారు..? ఏ యూనివర్శిటి అయినా డబ్బులకు ఇలా సర్టిఫికెట్స్ ఇచ్చిందా..? లేకుంటే టెక్నాలజీ సాయంతో ఇలా మార్చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.