పేరుకి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిందిపోయి.. అన్యాయానికి తెర లేపాడు. ఒకరికి తెలీకుండా.. మరొకరిని మోసం చేస్తూ.. మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న రెండో భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన వనస్థలీపురంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వనస్థలీపురం సహరా ఎస్టేట్ లోని గందారా అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఎడ్ల శంకరయ్య(39).. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు  నిర్వహిస్తున్నాడు. కాగా.. అతనికి 211లో వివాహమైంది. కొద్ది రోజులకే ఆమె తో విభేదాలు తలెత్తాయి. భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో.. ఆమె అతనిని వదిలేసింది. 

ఆ తర్వాత 2016లో మరో మహిళ శారద(38) ను పెళ్లి చేసుకున్నాడు. 2017లో వీరికి ఒక పాప కూడా జన్మించింది. అయితే, శంకరయ్య బదిలీ కావడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తున్న మంజుల రాణి అనే మహిళను శంకరయ్య 2019 నవంబర్‌ 30న తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న శారద వనస్థిలిపురం పోలీసులను ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు శంకరయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.