హైదరాబాద్‌లో మరోసారి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. మోకాలి లోతు నీటిలో వాహనాలు ముందుకు కదలకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో ప్రధాన జంక్షన్‌లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లో నూతనంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలకు పోలీసులు అనుమతించారు.

ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా... అదే సమయంలో... పర్యాటక రంగాన్ని మరింత డెవలప్ చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. నిబంధనల ప్రకారం శని, ఆదివారం ఈ వంతెనపై వాహనాలకు అనుమతి ఉండదు.

ఆ రెండ్రోజులూ ప్రజలు, పర్యాటకులూ... ఈ బ్రిడ్జిపై వాకింగ్ చేయడం కోసం మినహాయింపునిచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా ప్రభుత్వం ఆంక్షల్ని సడలించింది. ఇదే సమయంలో వంతెనపై వాహనాలు ఎక్కడా ఆపకూడదని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

కాగా, కూకట్‌పల్లి, ప్రగతి నగర్, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లలో భారీ వర్షం పడుతోంది. అటు దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట్, ఎల్బీ నగర్‌లలో కుంభవృష్టి కురుస్తోంది.

మరోవైపు వచ్చే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈశాన్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా తోడయ్యింది.

దీంతో వచ్చే మూడు రోజులు తెలంగాణ భారీ వర్షం ముప్పు పొంచి వుంది. ఇక చైతన్య పురిలో భారీ వర్షానికి వరద నీరు రోడ్లను ముంచెత్తింది. వరదలో కొట్టుకుపోయిన నలుగురిని కమలానగర్ కాలనీ వాసులు రక్షించారు.

భారీ వర్షానికి సాయంత్రం కార్యాలయాల నుంచి వచ్చే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోవడంతో వారు కంగారు పడుతున్నారు.

ప్రధాన రహదారులు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఎల్బీ నగర్- వనస్థలిపురం, అబ్ధుల్లాపూర్‌మెట్- ఇనామ్‌గూడ హైవే, మేడిపల్లి- ఉప్పల్, బీఎన్ రెడ్డి నగర్, సాగర్ రింగ్ రోడ్‌పై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

గంట నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. అటు నాగోల్ బండ్లగూడ ధనలక్ష్మీనగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.