అదనపు కట్నం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. డబ్బు మీది ఆశ అతి కిరాతకంగా కట్టుకున్న భార్యకే విషం తాగించి హత్య చేసేలా చేసింది. ఈ అమానుష ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ : extra dowry కోసం మూడు నెలల గర్భిణీని చిత్రహింసలు పెట్టి దారుణంగా కడతేర్చిన ఉదంతమిది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రాజుపేట తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ అనిల్ రెడ్డి కథనం ప్రకారం.. మల్కాపూర్ కు చెందిన కళ్యాణి (24)కి రాజ్ పేట్ తండా రాసి తరుణ్తో.. రెండేళ్ల క్రితం పెళ్లైంది. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత అదనపు కట్నం కోసం భర్త సహా అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. ఆమెను వదిలించుకోవాలని దురుద్దేశంతో మానసికంగా, శారీరకంగా బాధపెట్టేవారు. మంగళవారం భర్తతోపాటు మామ ఫకీరా, సమీప బంధువు ప్రవీణ్ బాధితురాలికి బలవంతంగా విషం, యాసిడ్ తాగించారు.
దీంతో ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేసింది. కళ్యాణి కేకలు విని పక్కింట్లో ఉన్న ఆమె అక్క శోభ కంగారుగా వచ్చేసరికి.. కల్యాణి కింద పడిపోయి నురగలు కక్కుతూ కనిపించింది. ఆమె వెంటనే స్థానికుల సాయంతో నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
ఇదిలా ఉండగా, మార్చి 25న కడపలో ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. పెళ్లై ఎనిమిది నెలలు అయింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది ఆ నవవధువు. పెళ్లయిన కొద్ది రోజుల వరకు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పెళ్ళికి కట్నకానుకల కింద రూ. 45 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తీసుకుని రావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. భర్తతోపాటు అత్తమామలు వేధిస్తుండడంతో భరించలేక ఓ married woman బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చింతకొమ్మదిన్నె మండలంలోని బృందావన్ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్సై మంజునాథ రెడ్డి వివరాల మేరకు.. సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరుకు చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి కుమార్తె గుగ్గుళ్ల నవిత (25) ఎంబీఏ వరకు చదువుకుంది.
2021 ఆగస్టులో సికె దిన్నె మండల పరిధిలోని బృందావన్ కాలనీకి చెందిన గుగ్గుళ్ల బాబారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. బాబారెడ్డి వ్యాపారం చేస్తున్నాడు. నవిత ఓ కంపెనీలో పనిచేస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంగా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల అదనపు కట్నం తీసుకుని రావాలంటూ భర్తతోపాటు అత్తమామలు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. వేధింపులు తట్టుకోలేక గురువారం నవిత చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడింది. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పుట్టింటివారు ఆస్పత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. సీకే దీన్నే తహసిల్దార్ విజయ్ కుమార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు.. నవిత తండ్రి లక్ష్మీ నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
