హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదు పర్యటన ఖరారైంది. ఆకస్మికంగా ఆయన ఈ నెల 28వ తేదీన హైదరాబాదు వస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ మోడీ హైదరాబాదు పర్యటనకు రానుండడంతో ఉత్కంఠ నెలకొంది.

అయితే, నరేంద్ర మోడీ భారత్ బయోటెక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు వస్తున్నారు. భారత్ బయోటెక్ లో ఆయన కరోనా వ్యాక్సిన్ పురోగతిని పర్యవేక్షిస్తారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి హబ్ గా హైదరాబాదు మారుతోంది. నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి వస్తున్నట్లు సమాచారం.

హైదరాాబాదులోని ఎల్బీ స్టేడియంలో అదే రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈ సభలో ప్రసంగించనున్నారు. నరేంద్ర మోడీ హైదరాబాద్ నుంచి సాయంత్రం 5.40 గంటలకు పూణే బయలుదేరి వెళ్తారు. మామూలుగా ప్రధాని పర్యటన వారం రోజుల ముందు ఖరారవుతుంది. హైదరాబాద్ పర్యటన మాత్రం రెండు రోజుల్లోనే ఖరారైంది.

జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1వ తేదీన జరుగుతుంది. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బిజెపి, ఎంఐఎం, టీఆర్ఎస్ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. 

బిజెపి, ఎంఐఎం, టీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదు కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నాయకులు ఒకరి తర్వాత ఒకరు వస్తూ పోతున్నారు. టీఆర్ఎస్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.