శ్రమించే కోట్లాది రైతులకు ప్రయోజనం: జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ

దేశంలో పసుపు, పసుపు ఉత్పత్తుల అభివృద్ధి, పెరుగుదలపై దృష్టి సారించే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పసుపు బోర్డు ఏర్పాటు నిర్ణయం శ్రమించే కోట్లాది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉపయోగపడుతుందని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. 

Pm Modi Tweets in telugu over establishment of National Turmeric Board ksm

దేశంలో పసుపు, పసుపు ఉత్పత్తుల అభివృద్ధి, పెరుగుదలపై దృష్టి సారించే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ పర్యటన  సందర్భంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన  చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు అనుగుణంగానే.. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజున నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన  కేంద్ర కేబినెట్ సమావేశంలో పసుపు బోర్డు సహా పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర పడింది. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల తెలంగాణ రైతుల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరినట్లైందని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై నుంచి ప్రధాని మోదీ ప్రకటన చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే నోటిఫికేషన్ వెలువడిందని అన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్‌(ట్విట్టర్)లో షేర్ చేశారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డుని ఏర్పాటు చేయడం ద్వారా ఏళ్ల నాటి డిమాండ్‌ను నెరవేర్చిందని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై ప్రదాని మోదీ స్పందించారు. ఈ నిర్ణయం శ్రమించే కోట్లాది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉపయోగపడుతుందని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. 

 


‘‘శ్రమించే కోట్లాది రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తీసుకున్న చాలా ముఖ్యమైన కేబినెట్ నిర్ణయం ఇది. రైతులకు మెరుగైన మార్కెట్లు, మరింత లాభాలు ఖచ్చితంగా లభించేందుకు జాతీయ పసుపు బోర్డు తోడ్పడుతుంది’’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇక, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారుగా ఉంది. 2022-23 సంవత్సరంలో 11.61 లక్షల టన్నుల (ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 75 శాతానికి పైగా) ఉత్పత్తితో భారతదేశంలో 3.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పసుపు సాగు చేయబడింది. భారతదేశంలో 30 కంటే ఎక్కువ రకాల పసుపును పండిస్తారు. దేశంలోని 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పసుపు పంటను సాగు చేస్తున్నారు.. పసుపును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులు ఉన్నాయి. 

ప్రపంచ పసుపు వాణిజ్యంలో భారతదేశం వాటా 62 శాతానికి పైగా ఉంది. 2022-23లో 380 కంటే ఎక్కువ ఎగుమతిదారులు 207.45 మిలియన్ డాలర్ల విలువైన 1.534 లక్షల టన్నుల పసుపు, పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేశారు. భారతీయ పసుపుకు ప్రధాన ఎగుమతి మార్కెట్ల జాబితాలో.. బంగ్లాదేశ్, యూఏఈ, యూఎస్‌ఏ,  మలేషియాలు ఉన్నాయి. పసుపు బోర్డు కేంద్రీకృత కార్యకలాపాలతో పసుపు ఎగుమతులు 2030 నాటికి 1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనా.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios