ఈ నెల 30న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ.. వివరాలు ఇవే..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నెల 30న ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ నెల 30న ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. అదే రోజు భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐటిఐ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న వేళ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే.. పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది.
ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కుమార్ రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డిలు వెల్లడించారు. తొలుత ప్రధాని మోదీ అక్టోబర్ 2న మహబూబ్ నగర్‌లో పర్యటిస్తారని అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వలన అంతకంటే ముందే ఈ నెల 30న ఆయన పర్యటన ఖరారు అయిందని చెప్పారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, ఇటీవలికాలంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన సంగతి తెలిసిందే. ఇక, ప్రధాని మోదీ చివరగా వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్తాపనలు చేయడంతో పాటు.. బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. తాజాగా మోదీ మహబూబ్ నగర్ పర్యటనతో.. తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నట్టుగా తెలుస్తోంది.