ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ప్రారంభమైంది. విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ప్రారంభమైంది. విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ కన్నా ముందుగానే ఆయన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ముందుకు విచ్చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి.. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
అనంతరం మోదీ పెద్దపల్లి జిల్లా రామగుండంకు హెలికాఫ్టర్‌లో చేరుకోనున్నారు. అక్కడ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను(ఆర్ఎఫ్‌సీఎల్) జాతికి అంకితం చేయనున్నారు. ఆర్ఎఫ్‌సీఎల్‌ను సందర్శించిన అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మోదీ.. ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
రామగుండం పర్యటలో భాగంగా ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి రూ. 9,500 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలో ఎరువుల ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు రూ. 1000 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 2200 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఎన్‌హెచ్-765డీజీ మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్, ఎన్‌హెచ్-161బీబీ బోధన్-బాసర్-భైంసా విభాగం, ఎన్‌హెచ్-353సీ యొక్క సిరోంచ నుండి మహదేవ్‌పూర్ సెక్షన్‌లు ఉన్నాయి.
