Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. ఆ విషయాలపై ఆరా..!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. 

PM Modi Phone call To YS Sharmila Reports
Author
First Published Dec 6, 2022, 11:51 AM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. షర్మిలకు ఫోన్ చేసిన మోదీ దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇటీవల షర్మిల కారులో ఉండగానే.. పోలీసులు టోయింగ్ వాహనంతో తీసుకెళ్లిన ఘటనపై మోదీ సానుభూతి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అలాగే నర్సంపేటలో షర్మిల పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మోదీని కలవాలని షర్మిల చెప్పగా.. ఆయన ఢిల్లీకి రావాలని సూచించినట్టుగా కూడా సమాచారం.

ఇక, సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలో జీ20 సన్నాహక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సమావేశం ముగిసిన తర్వాత.. రాజకీయ పార్టీ నేతలకు వద్దకు వెళ్లి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పలకరించారు. ఈ సమయంలోనే ఏపీ సీఎం జగన్ వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్ విషయాన్ని మోదీ ప్రస్తావించినట్టుగా ప్రచారం సాగుతుంది.

ఇదిలా ఉంటే.. వైఎస్ షర్మిల పాదయాత్రలో చోటుచేసుకున్న పరిణామాలు, హైదరాబాద్‌లో ఆమె అరెస్ట్‌ను తెలంగాణ బీజేపీ నేతలు ఖండించిన సంగతి తెలిసిందే. ఓ మహిళ పట్ల కేసీఆర్ సర్కారు విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శించిందని, ఇదో హేయమైన చర్య అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు ధర్నాలు, పాదయాత్రలు చేసే హక్కు ఉంటుందన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ప్రభుత్వం అరెస్ట్‌ చేసే పద్ధతి, తీసుకుపోయే పద్ధతి దుర్మార్గమని మండిపడ్డారు. 

వైఎస్ షర్మిల క్యారవాన్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టడాన్ని ఖండిస్తున్నానని బండి సంజయ్ ట్వీట్ చేశారు. మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేయడం,ఆమె వాహనాన్ని తగలబెట్టడం కేసీఆర్ అరాచక పాలనకు నిదర్శనమని అన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు మద్దతు తెలిపిన వారందరికీ షర్మిల ధన్యవాదాలు తెలిపారు. 

అలాగే ఈ ఘటనపై షర్మిల గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. మరోవైపు టీఆర్ఎస్‌పై మాటల దాడిని మరింతగా పెంచారు. ఈ క్రమంలోనే షర్మిలకు‌ ప్రధాని మోదీ ఫోన్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios